23. ఏకాగ్రత
ఏకాగ్రత అంటే కార్యసాధనలలో ఏదో ఒక్క విషయానికి
అగ్రమైన విలువనివ్వడం. అంటే ఒకే విషయంపై
ఎక్కువ శ్రద్ధ చూపించడం. ఏకాగ్రతతో
ఎటువంటి విషయాన్నైనా సాధించవచ్చు. ప్రతీజీవికి ఏకాగ్రత శక్తి ఉంటుంది.
దేహాంతర్గతమైన కారణాలవలన, పరిసరాల ప్రాబల్యంవలన ఇది ఎక్కువసేపు సాగించడం కష్టమనిపిస్తుంది. సాధారణంగా ఏకాగ్రతనే పదం కొద్దిసమయాన్ని
వెచ్చించి సాధించేవాటి విషయంలోనే వాడుతూంటారు.
పూర్వం ఋషులు, రాక్షసులు కూడా ఎన్నో సంవత్సరాల కాలం
ఏకాగ్రతతో తపస్సు చేసేవారని పురాణాలలో వింటూంటాము. ఋషులు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానంతో,
సమూపార్జన చేసి పొందిన శక్తిని లోకకళ్యాణానికి వాడడం, రాక్షసులు పొందిన తపో
శక్తితో తమ మనుగడకే ముప్పు తెచ్చుకోవడం అందరికీ తెలిసినదే. అంటే ఏకాగ్రత
సాధించగలగడం పదునైన కత్తిని సాధించడంలాంటిది.
పదునైన కత్తిని వాడి ప్రాణాన్ని నిలబెట్టే చికిత్సైనా చేయవచ్చు, ప్రాణాలు
తీసే అపాయమైనా కలిగించవచ్చు.
సాధారణంగా మనిషికి దేనిలో ఆనందం ఉంటుందని నమ్మకం
ఉంటుందో దానిపై ఏకాగ్రత నిలుపుతో ఉంటాడు.
ధనం సంపాదిస్తే జీవితం సుఖమయం అయిపోతుందని దానికే అగ్రస్ధానం ఇచ్చేవాళ్లు చాలామంది
కనిపిస్తూంటారు.పదవితోటే బ్రతుకు అని పాకులాడేవాళ్ళు కొంతమంది. శారీరక ఆకర్షణే
ప్రేమ అని, అదే జీవితమని అగ్రతని ఆపాదించి ఆత్మీయులకు దూరమై అశాంతిని పొందేవాళ్ళు
కొంతమంది. ఇంకా ఎన్నో రకాలైన వ్యామోహాలతో, హితం చెప్పేవారి మాటను పెడచెవిని పెట్టి
తరువాత నష్టాలకు గురవుతూంటారు కొంతమంది. ఈ లక్షణాలతో సాధారణ జీవనధర్మాలను కూడా
విస్మరించేవాళ్ళు కోకొల్లలుగా తయారవుతున్నారు ఈనాడు.
ప్రస్తుతానికి ధనం అనే విషయం గురించి కొంచెం
విశ్లేషిస్తే... నిజానికి ధనం అనేది ఎంతో అవసరమయినదే అయినా ఒక స్ధాయిని మించి
కూడబెట్టడంలో ఎన్నోసమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. డబ్బు కూడబెట్టడానికి
ఆత్మీయుల ఆదరణకు కూడా నోచుకోకుండా అవిరామంగా శ్రమపడడం, దానివలన కలిగిన అనాదరణ,
అశాంతితో అనారోగ్యం తెచ్చుకుని సంపాదించినది అనుభవించలేక కొంత, ఆసుపత్రులకు పోస్తూ
కొంత, వృధా ప్రయాసలాగ అనిపిస్తుంది ఎన్నో జీవితాల స్థితి.
ధనంకోసం ఏకాగ్రతతో మితిమీరిన శ్రమ కొంతమంది
మార్గమయితే, అవినీతి అక్రమం అన్యాయం మరి కొంతమంది మార్గంగా కనిపిస్తోంది. దీనివలన వర్తమానంలో ఇతరులు, భవిష్యత్తులో తాము
ఎన్నో రకాల భాధలు అనుభవించవలసి వస్తుందని గ్రహింపు జరగటంలేదు. మధుమేహరోగికి
శరీరానికి ఎంతో అవసరమయిన చక్కెర ఎక్కువయితే ఒక సమస్య, తక్కువయితే మరొక సమస్య
ఎలాగుంటుందో, అదేలాగ ధనానికి అర్ధం ప్రాముఖ్యత తెలియని మనిషికి అది ఎక్కువయినా
తక్కువయినా అనేక సమస్యలుంటాయి. అనుభవంలోకి వస్తేనేగాని గుర్తించలేకపోతే మధుమేహం
లాంటి ధనమేహం బారినపడి ఇబ్బందులు పడవలసివస్తుంది. ఓ రోగమయినా మరో అనుభవమయినా నాకు
కలిగితేనే నమ్ముతాను అనుకోవడం వివేకం కాదేమో.
నీతి, నియమం, న్యాయం, ధర్మం, గతం, భవిష్యత్తుల
గురించిన ఆలోచనలపై కూడా కొంత ఏకాగ్రత చూపిస్తే ముందు వ్యక్తికి తరువాత సమాజానికి
న్యాయం జరుగుతుంది.
చంచలస్వభావమైన మనస్సును నిలకడగా ఒకే విషయానిపై
ఉంచడం ఒక ప్రజ్ఞ. దేనికి అగ్రత ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవడంలో వివేకం చూపిస్తే,
చాలా సమస్యలు ఉండవు. సమస్యలు తగ్గేకొద్ది మిగిలిన
సమస్యలపై మరింత ఏకాగ్రత పెట్టి సులభంగా బయట పడవచ్చు. మనం సాధించగలిగే సమస్యను తీసుకుని
సాధించినప్పుడే, జీవితం ఆసక్తికరంగా విజయవంతంగా సాగుతోందనే భావన కలుగుతుంది. మనకు
సమస్యలు లేకపోతే మరొకరికి సాయంగానైనా బ్రతకవచ్చు. అందులోనున్న ఆనందానుభూతి పొందే
స్థితికి చేరిన మనుషుల సమూహంతో ఏర్పడిన సమాజం సుస్థిరత కలిగి ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి