బంధాలు



24. బంధాలు

సమస్యఅనేది ఎదురైతేనే కాని ఆలోచన కలుగదు. ఆలోచన లేకుండా విశ్లేషణ జరుగదు. ఈనాడు ఎక్కువమందిలో కనిపించే ముఖ్యమైన సమస్య ఒంటరితనం. దాని వలన భాధ, భయం, ఆతృత, అశాంతి. ఫలితం అనారోగ్యం. ఒంటరిగా జన్మించడం ఒంటరిగా జీవించడం ఒంటరిగా గతించడం అనేది అనాదిగా జరుగుతున్నదే. అయినా ఇప్పటికాలంలో స్వేచ్ఛాజీవనంపై మోజు పెరగడంవలన, కుటుంబ వ్యవస్థలో మార్పులు ఏర్పడుతున్నాయి. చదువులు, సంపాదనలు పేరున ఆలోచించే సమయంకూడా లేనట్లున్న పరుగులవలన ఒంటరితనం ఒక జఠిలమైన సమస్యగా మరలుతోంది. 
దీనికి పెద్దా చిన్నా అనే వయస్సుతేడా కూడా కనపడటంలేదు.  దీని ప్రభావం రెండు రకాలుగా గుర్తించవచ్చు. మొదటిది ఈనాడు చూస్తున్న అనేక రోగాలు, ఆసుపత్రులు. రెండవది ఆత్మీయత లోపంవలన సరైన సంప్రదింపులు జరపలేక తాత్కాలిక ఉద్రేకాలతో  ఆత్మహత్యలు హత్యలువంటి ఉపద్రవాలు.
ఈ ఒంటరితనం న్యూనతా భావనలు సాధారణంగా ఉమ్మడి కుటుంబాలలో ఎక్కువ కలుగవు. ఆత్మీయుల అండదండలు ఉన్న కుటుంబంలో, సమాజంలో మనిషి నిర్భయంగా ఏ భాధనైనా తట్టుకోగలడు. ఆనందంగా జీవించగలడు. ఆ సాధనే జీవిత పరమావధి. తనకికూడా ఎంతోకొంత విలువ ఉందనే నమ్మకంతో ప్యక్తిజీవనం సాగుతూ ఉంటుంది.తనవిలువ శూన్యంగా ఊహించుకునే పరిస్థితి కలిగితే విరక్తి కలుగుతుంది.  సరిగ్గా అటువంటప్పుడే సరైన ఆశించిన తోడు దొరికితే జీవితేచ్ఛ తిరిగి కొనసాగుతుంది.  ఆ తోడే అప్పటికి ఆధారం తరువాత ఆత్మ బంధంగా కూడా అవుతుంది.
అలాగనేకాక ఎన్నో రకాలుగా మనం బంధాలు కలిగి ఉంటాము. శరీర ఆవిర్భావానికి ఆశ్రయమైన అమ్మ ఒక బంధం. నా అన్న ప్రేమతో చూసే నాన్న మరో బంధం. ఇలా ఎన్నో బంధాలు. ఇవి కొనసాగించడానికి కొన్నిభాధ్యతలు కూడా వహించాలి. స్వేచ్ఛ పేరుతో ఈ భాధ్యతలకు సున్నాచుట్టే ప్రయత్నఫలితమే ఒంటరితనం.  మనుషులందరిలో ఐక్యతాభావన కలుగచేసే ఆకర్షణ, ఆత్మీయతా భావనే ప్రేమ అంటే. దురదృష్టం ఏమిటంటే కేవలం ఆడ మగ మధ్య శారీరక ఆకర్షణే ప్రేమ అనుకునే ఈ నాటి దౌర్భాగ్య స్థితి.
మనిషి అభిరుచులకు ఆశయాలకు అనుగుణంగా భావాలను అర్ధం చేసుకునే బంధుత్వం కలిగి ఉండడం మహాభాగ్యం. అది జన్మబంధం అయినా, వివాహబంధం అయినా, స్నేహబంధం అయినా సరే. అది పొందలేని వ్యక్తికి జీవితం ఫేలవంగాను, నిరాసక్తతతోను గడుస్తూంటుంది. కొన్ని సందర్భాలలో ఇటువంటి స్పందన తీవ్రమయితే సున్నితమైనవారి ప్రాణానికికూడా హానికలుగవచ్చును. ఇటువంటి పరిస్థితి సాధరణంగా వార్ధక్యంలోను, కార్య సామర్ధ్యం తగ్గినవారిలోను కనిపిస్తూంటుంది.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అనే సినీకవి గీతంలోని ప్రతీ పదము మానవ అంతరంగాన్ని విశ్లేషిస్తుంది. అసలు ఈ తోడూనీడలు ఎల్లప్పుడూ సాధ్యమయ్యేవి కావు.  నిజానికి ఏ వ్యక్తికైనా తన ఆదర్శాలకు తగ్గట్టు, తననుకున్నట్టు ఉండడం తనకే ఎంతోకష్టం. అటువంటప్పుడు మరోవ్యక్తినుండి ఆశించడం సమంజసం కాదేమో. అందుకే ఆంతర్యం ఎరిగిన నిత్యము సత్యము అయిన అంతర్యామితో బంధం అభిలషనీయం. శ్రీరామ నీ నామమెంతో రుచిరా అనడంలో  అర్ధం దైవంతో బంధంలో భావనను విశదీకరించడమే తప్ప ఉప్పు, పులుపు, తీపిలాంటి రుచి అని కాదు.  రుచి మరిగితే కాని రుచి అంటే అర్ధం తెలియదు.
మళ్ళీ లౌకిక విషయాలకి వస్తే, తల్లిదండ్రుల బంధం లేకుండా జన్మ సాధ్యంకాదు.  ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నది కొన్ని బంధాలనే సూచిస్తున్నా, పుట్టుకతోటే కలిగే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఇతర రక్త సంబంధాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  కేవలం భార్యాభర్తల బంధాలేకాదు ఈ బంధాలన్నీ (Made for each other) ఒకరికోసం మరొకరు అనే అర్ధం.
బంధం ఎటువంటిదైనా జీవితావసరాలకు ఒకరిపై ఒకరు ఆధారపడినపుడు ఎపరికి వీలయినట్లు వారు అవకాశ దుర్వినియోగం చేయడం, విడాకులవంటి బంధ నాశనానికి దారితీస్తుంది. పటిష్ఠమైన సమాజ నిర్మాణంకోసం ప్రతిపాదించిన వివాహబంధాలు, కుటుంబ సంబంధాలు, కులవ్యవస్థ, పరిపాలనారంగమూ దెబ్బతినడానికి కూడా ఎవరికి వీలయినట్లు వారు చేసిన, చేస్తున్న ఈ అవకాశ దుర్వినియోగమే మూలకారణం.  వ్యక్తుల స్పృహ కేవలం శారీరక భోగాలపైనే కాక ఆత్మీయతయొక్క ఆవశ్యకత కూడా పెడితే ఒంటరితనం, ఆందోళన లేకుండా బ్రతకవచ్చు, బ్రతకనీయవచ్చు.

కామెంట్‌లు లేవు: