మౌనం.
సమ్మతి అంటే ఒప్పుదల (Acceptance). ప్రతి సంఘటనను సరైన కోణం నుండి చూసి సమ్మతించ గలగడం మతోన్నతిని పొందిన వారి లక్షణం. మతం అంటే మానసిక స్థితి, పరిణతికి సంబంధిచినది. ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి భగవంతుడిపై విశ్వాసంతో, సర్వత్రా సమదృష్టి కలిగి ఉన్న వ్యక్తి అని భావించవచ్చు. అసలు మతం అంటే జీవన విధానం. యధేచ్చగా కాకుండా ఒక ఆలోచన, నమ్మకం ఆధారంగా బ్రతకడం వ్యక్తి మతంగా గుర్తింపబడుతూ ఉంటుంది. మతం అన్నది మానవతా లక్షణం. జంతువులకు పరిస్థితులను బట్టి చరించడమే తప్ప ఆలోచన, విచక్షణ జ్ఞానం ఉండదు. Human being is a wise animal. అంటే మనిషి వివేకవంతమయిన జంతువు.
జీవితం సుఖంగా సాగించాలనే ప్రయత్నం, విచక్షణ, వ్యక్తిగతంగా ఉన్నఎన్నో రకాలయిన నమ్మకాలను బట్టి ఉంటుంది. సాధారణంగా తమ నమ్మకాలను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి వ్యక్తులు, కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకొని తమ జీవన విధానాన్ని నిర్ధారించు కుంటారు. ఇలా ఒక వర్గంగా ఏర్పడిన వారిని ప్రత్యేకమయిన మతస్తులుగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది.
ఈ మతాలన్నిటికి సమ్మతమయినది మానవాతీతమయినది, అవ్యక్తమయినది దైవ శక్తి. ఆ దైవమే సర్వాంతర్యామి, అని గ్రహించి, జగన్నాటకంలో సూత్రధారి పాత్రధారుల చర్యలను అవగాహన చేసుకునే కొలది మౌనంగా ఉండగలిగిన సామర్ధ్యం పెరుగుతూంటుంది. ఈ మౌనమే సమ్మతాన్ని తెలియజేయు విధానం. ప్రతీ పరిస్థితిని, అనుభవాన్ని సమతుల్య భావనతో గ్రహించగల స్థితప్రజ్ఞ లక్షణమే మౌనం.
నిజానికి సృష్టిగతిలోని ఈ సమ్మతి, అసమ్మతి అనేవి రెండు జగన్నాటక ప్రగతికి నేపధ్యం లోని మతి అనుసరించే నీతియని సమ్మతించ గలిగితే, స్థితప్రజ్ఞత సిద్ధించినట్లే అనుకోవచ్చు. రెండిటి నిష్పత్తిలో లోపంగాని కొందరికే ప్రాప్తించడంగాని నేటి కాల ప్రభావం.
పూర్వాపరాలు.
(Half knowledge is dangerous) అర్ధజ్ఞానం ప్రమాదకరం అయినదని మనమందరం వింటూనే ఉంటాము. ఇక్కడ జ్ఞానం అంటే ఎరుక కలిగి ఉండడం లేదా స్పృహ కలిగి ఉండడమని ఆంగ్లంలో కాన్షస్ అని అర్ధం తీసుకోవాలి. కార్య కారణ సిద్దాంతం, అనుభూతి కారణ సిద్దాంతం, కర్మఫల సిద్దాంతం అంటూ ఏ పేరుతొ పిలిచినా జీవన సత్యాలను తెలియజేసే సిద్దాంతాలపై సరైన అవగాహన సాధిస్తే ప్రమాదమనే స్థితి కలిగే అవకాశమే ఉండదు.
నేడు కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీ అనే ఒక విధమయిన ప్రజ్ఞ ఆధారంగా స్వలాభాపేక్ష కోసమై కొంతమంది దుర్మార్గులు కలిపించే విభేదాలే ఈనాటి సామాజిక అశాంతికి కారణం. మనలో చాలామంది ఒక కధను వినే ఉంటాము. ఒక మేకల కాపరి మేకల మేతకోసమై వాటిని తీసుకొని తన కొడుకుతో సహా అడవికి వెడతాడు. అక్కడ కొడుకు తన తండ్రిని సరదాగా ఏడిపించడానికి, తనకి దూరంగా ఉన్నా సమయంలో, నాన్నా పులి వచ్చిందని అని అరిచి, పరుగుతో వచ్చిన తండ్రిని చూచి నవ్వుతూ, రెండు మూడు సార్లు ఆడిస్తాడు. నాలుగవసారి నిజంగా పులి రావడం జరుగుతుంది. అప్పుడు నిజంగా అరిచినా తండ్రి దానిని హాస్యం కోసమే అయి ఉంటుందని భావించి దగ్గరకి రాకపోవడం జరుగుతుంది. దానివలన కొంత నష్టము, ప్రమాదము చవి చూడవలసి వస్తుంది.
ఈ కధలో కేవలం ఆఖరిసారి కొడుకు అరిచినప్పుడు తండ్రి రాకపోవడం అనే విషయం మాత్రమే గమనించిన వారికి, తండ్రి పూర్తిగా కఠినమయిన వాడుగా దుర్మార్గుడుగా కనిపిస్తాడు. సరిగ్గా ఇదేవిధంగా మనం నిజజీవితంలో చూసే ఎన్నో సంఘటనల వెనుకనున్న కారణం అవగాహన లేక పోవడమే ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది.
కులం, మతం, భాష, ప్రాంతీయత, లింగమనే కాక ఉద్యోగం, పదవి, ధనిక, పేదరిక మొదలయిన ఎన్నో రకాలయిన విభేదాలను సృష్టిస్తూ ఎంతో మంది అమాయక జీవులను హింసించే వాళ్లు చేసే మోసాన్ని గమనించే ఆలోచన జ్ఞానం ఆరోగ్యకరమైన జీవనానికి చాలా అవసరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి